5, మార్చి 2011, శనివారం

ఈతరం అభిమన్యుడు





రాత్రి,
సమయం 11 గంటల 47 నిముషాలు.

నిర్మలంగా ఉన్న వాతావరణం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.జరగబోయే దారుణం ముందే వూహించాడేమో..... చంద్రుడు కూడా చూడలేక మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు.శక్తి నశిస్తోంది.అడుగు తడబడుతోంది.అయినా సరే,ఒంట్లోని శక్తినంతా కూడదీసుకొని పరిగెడుతున్నాడతను....చీకటిలో దారి సరిగా కనిపించడం లేదు.అక్కడక్కడా ఏవో చిన్న చిన్న రాళ్ళూ,కొమ్మలు అడ్డుతగులుతున్నాయి. ఇప్పటికే తనకు తగిలిన గాయాలతో పోలిస్తే అవెంత...!?!!ఎలగైనా సరే,ఈ విషయాన్ని తోటి విద్యార్థులకి తెలియజేయాలి.లేకుంటే....

రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది.విధ్యార్థి లోకం అట్టుడికిపోతుంది...కోట్లాది ఆస్థులు ద్వంసమౌతాయి.పరీక్షలు వాయిదా పడతాయి....భవిష్యత్తు సర్వ నాశనమయిపోతుంది.జరగబోయే ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలి.కాని శరీరమే సహకరించట్లేదు.ఇంకెంత,మరో 5 నిముషాలు వేగంగా పరిగెడితే హాస్టల్ ప్రహరి గోడ వచ్చేస్తుంది.

"ధభ్...!!!" తలవెనుకల గట్టిగా ఏదో తగిలింది.ఎగిరి ముందుకు పడ్డాడతను.ఇంతలోనే అతన్ని చుట్టుముట్టారు కొంతమందియువకులు.
అప్పటికే తగిలిన గాయాలవల్ల,విపరీతమైన ఆయాసం వల్ల లేవలేకపోతున్నాడతను.ఇంతలో ఒకడతని తలమీద గట్టిగా కొట్టాడు.అతడు అచేతనంగా పడిపోయాడు.
"చూసి కొట్టండి భే,అస్సల్...అనుమానం రాకుడదు!!!"....వెంటనే ఒకడు బలమైన రాడ్డుతో తలపైన బలంగా కొట్టాడు.
"........"
* * *
"చచ్చాడు యెదవ!!!ఎంత పరిగెత్తించాడ్రా మనల్ని....!!!" అన్నాడొకడు తెగ ఆయాశ పడుతూ.
"వదిలెయ్ రా!....చచ్చాడుగా...!" అంటూ కాస్త రిలాక్స్ అవదామన్నట్టు సైగ చేశాడింకొకడు.

'అంటే ఇంక కొట్టరన్నమాట!!' అనుకున్నాడతను.నిజానికి తను చావలేదు. చావుకి చాలా ద..గ్గ..ర్లో ఉ..న్నా..డు!!! శరీరం పనిచేయడం
మానేసింది.గట్టిగా స్వాస కూడా పీల్చలేని పరిస్థితి........

"....తనేమీ పెద్ద పెద్ద తప్పులు చేయలేదు.తనని చంపే అంతటి శత్రువులు కూడా లేరు.తనేంచేసినా అందరిలో ఒకడిగానే చేశాడు తప్ప ఎవరికీ ద్రోహం చేయలేదు.అంతా సవ్యంగా జరిగితే ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి మరో ఆరు నెలల్లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా చేరాల్సి వుంది.ఎందుకిలా జరిగింది!?..ఏంచేశాడు తను???"

ఎంసెట్ ఇంజినీరింగ్ లో మంచి ర్యాంక్ రావడంతో మూడున్నర సంవత్సరాల క్రితం ఆ యూనివర్సిటిలో చేరాడతడు.మొదటి రెండు సంవత్సరాలూ సజావుగానే సాగాయి.పరీక్షల్లో మంచి మార్కులు సాధించి అందరి మన్నలనూ పొందాడు.మొత్తానికి కాలేజిలో బాగా చదివేవాడని మంచి పేరే తెచ్చుకున్నాడు.మూడవ సంవత్సరం ప్రథమంలో కూడా బాగానే సాగింది.కాని...

సెప్టెంబరు-2009న అప్పటి ముఖ్యమంత్రి,గొప్ప నేత అయిన వై.యస్.రాజశేఖరరెడ్డిగారి మరణం రాష్ట్రంలో పలు సంచలనాలకు దారితీసింది. రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.అంతలోనే ప్రత్యేక తెలంగాణ,సమైఖ్యఆంధ్ర ఉధ్యమాలు తెర మీదకు వచ్చాయి.విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాష్త్రం మొత్తం కంపించి పోయింది.ఎటు చూసినా బంద్ లు,నిరాహార దీక్షలతో సతమతమైపోయింది.కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.ఎన్నో కోట్ల ఆస్థులు ధ్వంసమైయ్యాయి.ఈ విషయం పై అధ్యయనానికి హైకమాండ్ ఒక కమిటీని నియమించడంతో ఎన్నో రోజులుగా నెలకొన్న యుద్ధ వతావరణం తర్వాత నెమ్మదిగా చల్లారింది.కాని,జరగబోయే విధ్వంస కాండకి భీజం మాత్రం అప్పుడే పడిపోయింది.
* * *
పలుకుబడి పెంచుకోవడానికి,'అన్న' అని పిలిపించుకోవడనికి,రాజకీయ లబ్ధి పొందడానికి...కారణాలేవైతేనేం,వీధి రౌడీలు,దందాలు చేసే వాళ్ళూ రాజకీయాల్లో చేరి అసలే ఉడికిపొతున్న విద్యార్థుల్ని మరింత రెచ్చగొట్టారు.ఆస్థుల విధ్వంసం విషయంలో చాలా మంది విద్యార్థుల పైన కేసులు నమోదయ్యాయి.పోలీసులు విద్యార్థులకి,వారి తల్లిదండ్రులకి కౌన్సెలింగ్ ఇచ్చి కొంత వరకూ కట్టడి చేయగలిగారు.కానీ,చెడుకి అలవాటుపడ్డ మనిషి మంచిని జీర్నించుకోవడం కష్టం కదా...

యూనివర్సిటిల్లో విద్యార్థులు బ్యాచ్ లుగా విడిపోవడం అమాంతం ఎక్కువైపోయింది.ప్రతి చిన్న చిన్న విషయాలని పెద్దవి చేయడం,క్లాసులు
బహిష్కరించడం,క్యాంటీన్ లో గొడవలు...లాంటివి ఇంకా క్కువయిపోయాయి.తమ బ్యాచ్ గొప్పదని చాటుకోవడనికి వీధి రౌడిలతో స్నేహాలకు పాల్పడ్డారు.ఏ బ్యాచ్ ల మధ్య గొడవలు వచ్చినా,ఆ బ్యాచ్ కి ఫలానా 'అన్న' తెలుసు,వాళ్ళతో జాగ్రత్తగా ఉండలనే స్థాయికి వచ్చేశారు.
* * *
ఇలాంటి విషయాలకి దూరంగా ఉండే కొంత మంది మాత్రం 'ఏదో వచ్చామా...వెళ్ళామా...' అన్నట్లు ఉండేవారు.ఇతను కూడా తన పనేదో తను చూసుకొని వెళ్ళేవాడు.అన్ని చీమలూ బెల్లం వైపు వెళ్తూంటే ఏ చీమైనా ఎంతవరకు వెళ్ళకుండా వుండగలుగుతుంది!!?!
క్రమంగా అలవాట్లు మారాయి...
వేషధారణ మారింది...
కొత్త కొత్త స్నేహాలు...

తనకి తెలియకుండా తానే మారిపోయాడు...

గ్యాంగ్ ఫైట్స్ లో పాల్గొనే స్థితికి వచ్చేశాడు.అంత మారినా న్యాయానికి విలువ ఇస్తాడని ఓ మంచి పేరు తెచ్చుకున్నాడు.కాలేజి భాషలో చెప్పాలంటే....హీరోలా అయిపోయాడు.

ఉధ్యమాల తరపున ప్రభుత్వంతో పోరడాడు.ఫలితంగా అతని పై కేసులు నమోదయ్యాయి.పోలీసులు అతని తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు.పరీక్షల సమయం కూడా దగ్గర పడుతూండడంతో చదువుకి పని చెప్పాడు.తర్వాత కొన్ని రోజులు అలాంటివాటికి దూరంగానే ఉన్నా కాలక్రమేణా మళ్ళీ దానికి అలవాటు పడిపోయాడు.పోలీసుల ముందు తన తల్లిదండ్రులు అలా నిలబడాల్సిరావడం అతన్ని తీవ్రంగా బాధించాయి....ఇంకోలా చెప్పాలంటే,తనకి తెలియకుండా తానే వ్యవస్థని అసహ్యించుకునేలా చేశాయి.

ఇంతలో మూడవ సంవత్సరం ఫలితాలు వచ్చేశాయి.మార్కుల శాతం తగ్గినా ఫస్టు క్లాసులోనే పాసయ్యాడు.అతడు తిరిగి తన 'పరిధి'ని పెంచుకుంటూపోతున్నాడు.

రాష్ట్ర రాజకీయల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎవరు ఎప్పుడు ఏ పార్టిలో ఉంటారో చెప్పడం కష్టమైపోతోంది.రెండు,మూడు పార్టీల నాయకులు ఓ చోట జనాన్ని పోగెయ్యడం,ఏదో విషయం మీద రోడ్డెక్కడం సాధారణ విషయంగా అయిపోయింది.చివరికి విదేశీయులకు, ప్రవాసాంధ్రులకు ప్రస్తుత పరిస్థితిలో మన రాష్ట్రానికి వెళ్ళకపోవడమే మంచిదనే 'సౌకర్యాన్ని' కల్పించారు.అసలే వ్యవస్థ మీద ద్వేషం
పెంచుకున్న ఇతనికి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఎదిరించి తమ కోరికలను సాధించుకోవలన్న విషయం బలంగా నాటుకుపోయింది.దానికి తోడు చిన్నా చితకా రాజకీయ రౌడీల అండతో మరింత రెచ్చిపోయాడు.పార్టి మీటింగ్ లకు,రాస్తా రోకోలకూ జనాల్ని తరలించేవాడు.
* * *
ఓ రోజు,
"హేయ్ విన్నీ!!!సాయంత్రం సినిమాకెళ్దాం వస్తావా!!?!..." వెటకారంగా అన్నాడతను ఓ అమ్మాయితో.ఆమె ఓ చూపలా చూసి ఏమనకుండా వెళ్ళిపోయింది.
"ఎంత పొగర్రా దీనికి??..."
"పొగరు కాదు మామా!ఈ అమ్మాయిలంతా అంతే, టైంపాస్ కే ప్రేమిస్తారు.డబ్బున్నోడినే పెళ్ళి చేసుకుంటారు.లేకపోతే సంవత్సరం పాటు నిన్ను ప్రేమించి చిన్న కారణానికే విడిపోవాలా..."
"అదేరా నేనూ అంటున్నది.ఎంత శంకరన్నతో తిరిగితే మాత్రం,ఆయనలాగ నేను రౌడిలా తయారౌతానా? ఏదో కాలేజికదా,సరదాకోసం తిరుగుతున్నా...కాలేజి అయిపోయాక కూడా అలాగే ఉంటానా?? మనకేం పన్లేదా??? ఇలా కాదు.వచ్చే నెల మన యూనివర్సిటికి కంపెనీలు వస్తున్నాయిగా!!!క్యాంపస్ ఇంటర్వూలో జాబ్ తెచ్చుకొని చూపిస్తా...నేనంటే ఎంటో...."
* * *

జాబ్ సంపాధించి ఆ అమ్మాయికి గర్వంగా చుపించినా ఏడుస్తూ వెళ్ళిపొయిందే తప్ప,తనతో మాట్లాడలేదు."ఏమైంది దీనికీ?" అనుకున్నాడే కాని దానికర్థం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

'నేను మునుపటిలా మారాలని,గొడవలకి దూరంగా ఉండాలనీ ఎంత పరితపించింది ఆ అమ్మయి?చివరికి తనే దూరమైపోయింది.ఎంత ప్రేమించివుంటే నాకోసం అంతలా ఏడుస్తుంది??కనీసం అప్పుడైనా నేను ఆలోచించి ఉండాల్సింది.తెలియకుండా ఎంతో ఇబ్బంది పెట్టాను.నాకీ శిక్ష
పడాల్సిందే'.

ఎక్కడికో మోసుకెళుతున్నారు తనని!!!తన అంచనా కరక్టే అయితే తనని ఎదైనా ఎత్తైన ప్రదేశం నుంచీ పడేయాలి.అన్ని గాయాలైన అతన్ని అనుమానం రాకుండా ఆత్మహత్యలా చూపించాలంటే అదొక్కటే దారి.ఎక్కడికి తీసుకెళుతున్నారు???

* * *
ఎప్పటిలానే అతన్ని,అతని ఫ్రెండ్స్ ఇద్దరిని మెయిన్ రోడ్డు దగ్గర దించి వెళ్ళిపోయిందో కారు.అక్కడి నుంచి అడ్డ దారిలో కొంత దూరం నడిస్తే వాళ్ళ హాస్టల్ వస్తుంది.

"మురళీ,భాస్కర్!మీరేమన్నా చెప్పండ్రా!!!ఈ విషయం లో మాత్రం నేను ఏకీభవించలేను.అరె,ఉధ్యమం కోసం ఒకణ్ణి చంపమనడమేంట్రా!!!"...
"రే,శంకరన్న ఉద్దేశ్యం అది కాదురా...కమిటీ నివేదిక ఇచ్చి రెండు నెలలు అవుతోంది.అయినా హైకమాండ్ నుంచి ఎలాంటి తీర్పు రాలేదు.మళ్ళీ ఉధ్యమాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.పోయిన సారి ఆ యూనివర్సిటిలో 10 మంది చనిపోయారు కదా,అపోజిషన్ పార్టి నాయకుడు ఆ యూనివర్సిటికి అండగా నిలబడి అక్కడి ప్రజలందరి అభిమానాలూ పొందాడు.రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి అతనే ఎం.ఎల్.ఏ అంట తెల్సా..?!! అరె మురళి,చెప్పరా.."అన్నాడు భాస్కర్.

"అయినా,అన్న చంపమని చెప్పలేదురా...ఆత్మహత్యాయత్నం లాంటి వాతావరణాన్ని స్రుష్ఠించమన్నాడంతె...బాగా చదివే ఒకడికి డ్రింక్ లో విషం కలిపి ఇద్దాం.కొంచం ఎఫెక్ట్ తెలియగానే మనమే హాస్పిటల్లో చేర్పిద్దాం!తర్వాత వాడికీ విషయం చెబితే వాడే అర్థం చేసుకుంటాడు.ఉధ్యమం కోసమే అలా చేశానని మీడియా ముందు వాడి చేతే చెప్పిద్దాం!!ఈ విషయం మీద అన్నతో కల్సి 4 రోజులు మీడియాలో హడావుడి చేశామనుకో,దెబ్బకి వాడూ
పాపులరయిపోతాడు.అన్నకి పబ్లిసిటి బాగా వస్తుంది.పైగా అన్న గెలిస్తే మనకే కదరా మంచిది!మనకు కావలసినవన్నీ జరుతాయిగా!!!...." అంటూ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు మురళి.

"మనం అన్నకి సపోర్ట్ చెయ్యాలి.కాదనను.కానీ చావుతో ఆటలేంట్రా!!మనలో ఎవరైనా ఉధ్యమం కోసం చనిపోతే అతని కొసం పోరాడుదాం, తప్పులేదు.కానీ ఒకర్ని చంపి దాన్ని రాజకీయం చేయడం....మహా పాపం రా!వాళ్ళంటే ఇలాంటివి చేసి పైకి వచ్చి వుండొచ్చు!మరీ ఇలాంటివి మనకొద్దురా......అర్థం చేస్కోండి..."

"నీకేం రా!ఇంకో ఆరు నెలల్లో జాబ్ లో చేరిపోతావ్!మా గురించి కూడా కాస్త ఆలోచించరా!!"....

"రేయ్!మీకేమన్నా పిచ్చి పట్టిందా!!ఇప్పుడు కనక ఇలాంటివి జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమయిపోతుంది.అటు చూసినా బంద్ లు,దీక్షలు.అసలే పరీక్షలు దగ్గరపడుతున్నాయి.పిల్లల దగ్గరి నుంచి మనందరి భవిష్యత్తు నాశనమైపోతుంది.నిజంగా ఉధ్యమాల కోసం ఆత్మహత్య చేసుకునే వాడైనా ఇలాంటి పరిస్థితిలో ఎవడూ చేస్కోడు రా!కనీసం పిల్లల గురించైనా ఆలోచిస్తాడు!!ఉధ్యమాలు చేయడం మన బాధ్యతయితే,ఇలాంటివి జరగకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది.

ఈ విషయం ఇంతటితో వదిలేయండి.ఈ విషయం లో మనం అన్నతో కలసి పనిచేయట్లేదు,అంతె.... " కోపంగా అన్నాడతను వారినుద్దేసించి.

"సర్లే,ఈ విషయమ్మీద అన్నకి ఎదో ఒకటి చెబుదాంలే కాని,ఓసారి నీ మొబైల్ ఇవ్వు,చిన్న కాల్ చేస్కోని ఇస్తా...."
మొబైల్ తీసి మురళికి ఇచ్చాడతను.

"ధన్.....!!!!!"

వెనుక నుంచి ఎవరో అతని తలపై కొట్టారు.పడబోతూ రెండగులు పక్కకి వేసి పక్కనున్న చెట్టుకొమ్మని పట్టుకుని లేచి నిలబడ్డాడు.
'వీళ్ళంతా....శంకరన్న మనుషులు!!!తననెందుకు కొడుతు.......భాస్కర్,మురళి ఏరి!!??!' అతని కను రెప్పలు పెద్దవయ్యాయి.
'ఓ..........మై........గాడ్!!!!!!!!!' అతనికి జరగబోయేదేంటో స్పష్టంగా అర్థమైపోయింది.

ఇంతలో తనని కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఒకడిని మధ్యలోనే ఒడిసి పట్టాడు.పిడికిలి బిగించి వాడి కడుపులో బలంగా కొట్టి,వాడి వెనుకల వస్తున్న వారి వైపు తోశాడు.ఊహించని విధంగా అలా జరగడంతో ఒకరికొకరు తగిలి అందరూ క్రిందపడ్డారు.

ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హస్టల్ వైపు పరిగెడుతున్నాడతను.

మరీ మెరిట్ స్టూడెంట్ కాకపోయినా తను ఓ రకంగా బాగా చదివే స్టూడెంటే.పైగా కాలేజీలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఒకవేళ తను చనిపోతే తన వైపు పోరాడే వాళ్ళు చాలా మందే ఉంటారు.'ఎంత పెద్ద స్కెచ్చేశార్రా!నన్నే చంపి ఆత్మహత్యగా చూపించాలంకుంటారా!!!భాస్కర్,మురళి పారిపోయి ఉంటారు.అవకాశావాదులు.రేపు వాళ్ళకీ ఇలా జరగదని నమ్మకమేంటి? అయినా ఇంకెంత,ఇంకో ఐదు నిమిషాలు వేగంగా పరిగెడితే హాస్టలు వచ్చేస్తుంది '.

* * *
కానీ అంతలోనే ఒకడు ఏదో విసరడం,అది తగిలి తను పడిపోవడం,తనని కొట్టడం,వాళ్ళ ద్రుష్ఠి లో తను చనిపోవడం అన్ని జరిగిపోయాయి.తనింకా కొన ఊపిరితో ఉన్నా,కనీసం మాట్లాడే శక్తి లేదు.ప్రస్తుతం ఎక్కడికో తీసుకెళుతున్నారు తనని.

చాలా రక్తం పోయింది.శరీరమంతా లోపలి నుంచి లాగుతునట్లుగా ఉంది.

'అమ్మ చాలా సార్లు చెప్పింది, మనకి రౌడీలతో,రాజకీయ నాయకులతో పరిచయాలు వద్దు,ఏమైన గొడవలు జరిగితే వాళ్ళు బాగానే ఉంటారు,నష్టపోయేది మనమే అని.వింటేగా?

ఆ మాటే వినివుంటేనా.....ఆరు నెలల తర్వాత మంచి జాబ్,రెండు సంవత్సరాల తర్వాత విన్నీని పెళ్ళి చేసుకొని హాయిగా ఉండే వాడిని.అయినా ఈ వయసులో ఎవరో కొందరు తప్ప,ఎవడు మాత్రం చెప్పిన మాట వింటాడు??వయసలాంటిది!!!ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టానో,ఇప్పుడింత దారుణంగా చస్తున్నా...'

చుట్టు పరిసరాలూ అవి చూస్తుంటే......అది తన కాలేజినే...బాయ్స్ హాస్టల్ కే తీసుకెళుతున్నారు తనని.అంటే తన హాస్టల్ పైనుంచే తనని పడేస్తారన్న మాట.తన గ్యాంగ్ వాడెవడైనా చూస్తే బావుండు!!!!!

దాదాపు అన్ని గదుల్లోనూ లైట్లు ఆఫ్ చేసున్నాయి.అక్కడక్కడ గదుల్లో లైట్లు వెలుగుతున్నా రూంలో వాళ్ళకి తాము కనిపించే ప్రసక్తేలేదు.
భాస్కర్,మురళిలు ముందే ఏర్పాట్లు చేసినట్లున్నారు.ఎటువంటి అనుమానం రాకుండా హాస్టల్ లోపలికి అతన్ని తీసుకొచ్చే తీసుకొచ్చేశారు శంకరన్న మనుషులు.ఎవరూ చూడకుండా ఒక్కో అంతస్థు పైకి తీసుకెళ్తున్నారు.

కళ్ళు మూతలు పడేలా ఉన్నాయి.స్ప్రుహ తప్పుతున్నట్లుగా ఉంది.ఇప్పటికైన హాస్పిటల్లో చేర్పిస్తే బ్రతుకుతాడేమో!కాని ఎవరూ తమని గమనించడంలేదు!!!

'అంతా అయిపోయింది.ఉధ్యమం కోసం తను ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త రేపందరికీ తెలుస్తుంది.అపోజిషన్ పార్టిలన్ని చేరి తమ 'సానుభుతి'నీ,విద్యార్థులకి తమ 'మద్దత్తు'నీ తెలియజేస్తాయి.

మళ్ళీ బంద్ లు,రాస్తారోకోలు......ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరగబోతోంది.....

అమ్మానాన్నా,విన్నీ!!మీ మాట పెడచెవిన పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించబోతున్నాను.నన్ను క్షమించండి.మరో జన్మంటూ ఉంటే మీ ఆశలు నెరవేర్చే కొడుకుగా పుట్టి మీ రుణం తీర్చుకుంటా......ఐ మిస్ యూ విన్నీ!!!'

...........................????

తనని మెట్లమధ్యనే వదిలేసి వెళ్ళిపోతున్నారు......కాదు.....తనని వదిలేసి పా..రి..పో..తు..న్నారు!

అన్ని గదుల్లోనూ లైట్లు వెలుగుతున్నాయి.అరుపులు పెద్దవౌతున్నాయి....

'హాహ్!నేను గెలిచాను.నా ఫ్రెండ్స్ ఎవరో చూసి ఉండి ఉంటారు.మొత్తానికి ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపగలిగాను!!!
ఇప్పుడు నేను చనిపోయినా ఎవరో హత్య చేసారంటారు కాని ఉధ్యమం కోసం ఆత్మహత్యలంటివి అసలు అనుకోరు...

అరుపులు పెద్దగా వినిపిస్తునాయి...నా వైపే వస్తున్నారు.......

భగవంతుడా....దయచేసి నన్ను బ్రతికించు!!!ఈ దుర్మార్గుల భరతం పడతాను...........'

----------------------------------------------