4, డిసెంబర్ 2010, శనివారం

గోవిందా…గోవింద…



17-మే-2002,
తిరుపతి.

తెల్లవారుతోంది.మాములుగా అయితే ఇంకాసేపు పడుకొని దొర్లేవాడినేమో!.కాని ఈ రోజెందుకో చాలా టెన్షన్ గా ఉంది. అయిష్టంగానే లేచి పేపరు తిరగేశాను.

నేడే ఎంసెట్ ఫలితాలు విడుదల

న్యూస్ టుడే,హైదరాబాద్.ఎంసెట్-2002 ఫలితాలు ఈరోజు ఉదయం 7.30గంటలకు జె.ఎన్.టి.యు క్యాంపస్,మాసబ్ ట్యాంక్ నందు విడుదలకానున్నాయి…

అంతే,మెదడు మొద్దుబారిపోయింది.దేవుడా,దేవుడా అనుకుంటూ కాం గా స్నానం చేసి తయారయ్యాను.అప్పటికి మవూళ్ళో ఇంటెర్నెట్ సెంటెర్లు కొన్ని మాత్రమే ఉండేవి.అవి కూడా 10గంటలకి కాని తెరవరు.ఈ ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మ్రోగింది…
“హలో గ్యానా!నేన్రా,రా రిజల్ట్స్ చూసుకుందాం”.
“వస్తున్నాను…”
                                          *                                     *                                   *
నా పేరు ఙ్ఞాన ప్రకాష్.అందరూ “ఙ్ఞాన” లేదా “ప్రకాష్” అంటారు.ఈ ప్రపంచంలో నా పేరుని ఖూని చేసి “గ్యానా” అని పిలిచేది ఒక్కడే… మా ముని గాడు.నెట్ సెంటెరుకెళ్ళి రిజల్ట్స్ చూసుకున్నాం…
సమయానికి మా అన్న ఆన్ లైన్ లోనే ఉన్నాడు.నా ర్యాంక్ పంపాను……5…8…7…5…2!?!!!
రేయ్!ఏందిరా ఇది?ఏదో ఫోన్ నెంబర్ చెప్పినట్లు చెప్తున్నావ్…ఏమైనా వస్తుందా…..క్,ఖ్,గ్,ఘ్,ఙ్……”
నా బుర్రకేమి ఎక్కడం లేదు.నా స్థాయికి కనీసం 20,000-25,000లోపు  వస్తుందనుకున్నాను… ఏంటిది?
ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి.మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాను.”మామా!నాకు 70వేలల్లో వచ్చిందిరా…నీకు??…”
హమ్మయ్య….వాడితో మాట్లడాక ఇంకొకడికి చేశాను.వాడికి ర్యాంకు ఏకంగా లక్ష పైనే…ఇంతలో కొంతమంది ఫ్రెండ్స్ రావడంతో అందరం కల్సి కాలేజికి వెళ్ళాం.పొయిన సంవత్సరం రాష్త్రంలో 5వ,13వ ర్యాంకులతో పాటు మంచి ర్యాంకులను తెచ్చుకొని తిరుపతిలోనే నెం.1గా నిలిచిన మా కాలేజి,ఈసారి పుట్టుకొస్తున్న కార్పొరేట్ సంస్థల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోయింది. కనీసం 200వ ర్యాంకు కూడా అందుకొలేకపోయింది.నాకుమాత్రం కొంచం ధైర్యమేసింది.ఇంటికెళ్ళాను.
                                          *                                     *                                   *
58వేలా!!?!,ఇంక నీకు ఇంజినీరింగ్ సీటు వచ్చినట్లె…క్,ఖ్,గ్,ఘ్,ఙ్……” అంటూ వెళ్ళిపోయారు నాన్న.కాలేజి నిర్వహించే ఎంసెట్ పరిక్షల్లో మార్కులు బాగానే రావడంతో కొంచం ఆశలన్నా పెట్టుకొని ఉన్నారు.ఎందుకొ,బాగా బాదేసింది.కొన్నిరోజుల తర్వాత,ఇంటర్లో మార్కులశాతం బాగానే ఉండడంతో చెన్నైలోని ఓ కాలేజిలో పేమెంట్ సీటులో చేర్పించారు నాన్న.సిటి,పైగా ఊరికి దగ్గర కావడంతో చేరిపొయాను.
                                          *                                     *                                   *
మా సీనియర్ల బ్యాచ్ తోనే ప్రారంభించారంట ఆ కాలేజిని.పక్కన ఇంకా ఏవో కడుతూనే ఉన్నారు.మొదటి రోజు ఓ చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసి కాలేజి గురించి చెప్పారు.మద్యాహ్నం క్లాసులోకెళ్ళి కూర్చున్నాం.మొత్తం గోల గోలగా ఉంది.తెలుగోడు మరో తెలుగోడి పరిచయం కోసం చూస్తుంటే,తమిళోళ్ళు మరో తమిళుడిని వెతుకుతున్నారు.
“డు యు నో తమిళ్?” అని పలకరిచాడో వ్యక్తి.
“డొంట్ నో”…
“హాయ్!దిస్ ఇస్ బాలాజి!”.ఇంతలోనే…
“ఆర్ యు తెలుగు?”…
“యెస్…”
“నా పేరు బోస్.ఒంగోలు.”
“హాయ్!నా పేరు ఙ్ఞాన ప్రకాష్,తిరుపతి!!!”.ఆ రోజునుంచి ముగ్గురం ఒకటే బెంచ్.త్వరలోనే నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత నా వెనుక బెంచిలో కూర్చునే బాలక్రిష్ణ అనే అబ్బాయి కూడా మాతో కలిసి పోయాడు.
                                          *                                     *                                   *
రోజులు గడుస్తున్నాయి.లెక్చరర్లు చెప్పేది ఒక్క ముక్కా బుర్రకి ఎక్కట్లేదు.కొన్న పుస్తకాలని అటు ఇటు తిరగేసి అర్థం చేసుకునేలోగానే తొలి సెమిస్టెర్ పరిక్షలు వచ్చేశాయి.[మన యూనివర్సిటిల్లో 2వ సంవత్సరం నుంచి సెమిస్టెర్లు వుంటాయి.చెన్నై లోని అన్నా యూనివర్సిటిలో అయితే మొదటి సంవత్సరం నుంచే మొదలవుతాయి].ఏదో అలా భయపడుతూనె “మమ” అనిపించేశాం.రెండవ సెమిస్టెర్ మొదలయింది.
                                          *                                     *                                   *
ఓ విషయం మరిచాను.మా కాలేజి పైకి తెలుగు మైనారిటి కాలేజి అని పిలవబడుతున్నా….ఇక్కడ చదువుతున్న వారంతా ఎక్కువ శాతం తెలుగు వారే.హాస్టల్ ఫీజు బాగా ఎక్కువగా అనిపించడంతో బయట రూం ఏర్పాటు చేయించి వెల్లిపొయారు మా నాన్న.కొత్తగా చేరిన వాళ్ళంతా హాస్టల్లోనే చేరడంతో మొదటి సంవత్సరం ఒంటరిగా గడపక తప్పలేదు.శని,ఆది వారాల్లో ఫ్రెండ్స్ నా రూం కి వస్తూండడంతో అలా కాస్త సమయం గడిచిపోయేది.నా భాష వాళ్ళకి అర్థం కాకపోయినా,వాళ్ళ భాష నాకర్థం కాకపోయినా మా ఇంటి ఓనరు కొడకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు.అలా త్వరగానే తమిళం నేర్చుకోగలిగాను.
                                          *                                     *                                   *
చెన్నైకి తిరుపతి దగ్గరే కావడంతో ప్రతి 2,3 వారాలకొకసారి తిరుపతి వెళ్ళేవాడిని.తిరుపతి వెళ్ళినపుడల్లా మునిగాణ్ణి కలిసేవాడిని. అలా ఓసారి కలసినప్పుడు వివేక్ అనే వ్యక్తి గురించి చెప్పడం జరిగింది.వివేక్ ఇంటర్మీడియట్లో మునికి సీనియర్.నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అతణ్ణి మునితో కొన్నిసార్లు చూశాను.
వివేక్ సినిమాల్లో దర్శకత్వం చేయాలని చాలా గట్టిగా భీష్మించుక్కూర్చున్నాడు.ఎవరెన్ని విధాలుగా నచ్చజెప్పినా విన్లేదు. చదవడం మానేసి మాకందరికీ కథలు చెప్పడం మొదలుపెట్టాడు.కనీసం చదువయ్యాక అవకాశాలకోసం ప్రయత్నించమన్నా విన్లేదు. దాంతో బాగా అలోచించి ఒక షరతు మీద వాణ్ణి కట్టడి చేయగలిగాం.అదేంటంటే ఒక నెల రోజులు చెన్నై వచ్చి అవకాశాలకోసం ప్రయత్నించాలి.రాకపోతే చదువయ్యేవరకు వాటిని దూరంగా ఉంచాలి.ఒక వ్యక్తి ఊరు కాని ఊరు వచ్చి నెల రొజుల్లో అవకాశం దక్కించుకోవడం చాలా కష్టంతో,అద్రుష్టంతో కూడుకున్న విషయం.మొత్తానికి చెన్నై తీసుకొని వచ్చి ఒక నెల రోజులు నా రూంలో ఉండేలా నిర్ణయించుకున్నాం.
ఇదిలా జరుగుతూండగానే తొలి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి.మా క్లాసులో 60మందికి 7మంది మాత్రమే పాసయ్యారు. ఆ 7మందిలో నేనూ ఒక్కడినయ్యాను.అంతె,మా కాలేజి లెక్చెరర్లు,చైర్మన్ మమల్ని ఆకాశ్నికెత్తేశారు.ఇంతలోనే కలేజ్ డే అంటూ కోలాహలం మొదలయింది.స్పోర్ట్స్ అని,డ్యాన్స్ అని రకరకాల ప్రోగ్రాంస్ జరుగుతాయంట.అందరూ పిచ్చి పిచ్చిగా పేర్లు నమోదు చేసుకొని,ప్రాక్టిస్ నెపంతో క్లాసులకి రావడమే మానేశారు.నేను కూడా డ్యాన్స్,డ్రాయింగ్ లో పేరిచ్చాను.
                                          *                                     *                                   *
స్వతహాగా నాకు చిన్నపటి నుంచే డ్రాయింగ్ లో మంచి ప్రవేశం ఉంది.మా స్కూలులో దాదాపు చాలా ప్రైజులు వచ్చేవి.ఇక డ్యాన్స్ పై మక్కువతో సొంతంగానే సినిమా పాటలకనుగుణంగా స్టెప్పులు నేర్చుకున్నాను.ఇంటెర్ చదువుతున్నప్పుడు నా డ్యాన్స్ ని తొలిసారి పరిక్షించుకున్నా!!.అందరు బాగానే అభినందించారు.
మేము పేర్లు నమోదు చేసుకొనే ముందే చాలా మంది పేర్లు ఇచ్చేసి ఆర్భాటంగా ప్రాక్టిస్ కూడా మొదలుపెట్టేశారు.అలనాటి నాగేశ్వర్రావుగారి ‘ఒక లైలా కోసం’ పాట నుంచి అప్పుడే రిలీజ్ అయిన ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా వరకు ఏ పాటనీ వదల్లేదు. బోసు,బాలక్రిష్ణ లు మరో ఇద్దర్ని పోగేశారు.మొత్తనికి ట్రూప్ గా అయితే ఏర్పడ్డాం కాని ఏ పాటకి వేయాలో తెలియక చివరికి ఒక ఇంగ్లీష్ పాటని తీసుకున్నాం.అలా ఓ పదిరోజులపాటు మా ప్రాక్టిస్ నిరాడంబరంగా సాగింది.ఇంతలోనే సీనియర్ల దందా మొదలయింది.
                                          *                                     *                                   *
“ఎవ్వడ్రా నేను వేసిన పాటకి డ్యాన్స్ వేసేది…?!!ఒకసారి సీనియర్లు వేసిన పాటకి వాళ్ళు కాలేజ్ వదిలి వెళ్ళేవరకు మళ్ళి ఎవ్వడూ ఆ పాటకి వేయకూడదు”…అని కండీషన్స్ పెట్టారు.దాంతో చాలా పాటలకి బ్రేక్ పడింది.మాది కూడా ఎవరో సీనియర్ వేశాడంట. మా ప్రాక్టిస్ ఆగిపోయింది.కాలేజ్ డే సమీపిస్తోంది.క్లాసులకి నామం పెట్టడం కోసం ప్రాక్టిస్ మొదలుపెట్టినవాళ్ళూ, సీనియర్ల ధాటికి బ్రేక్ పడ్డవాళ్ళూ ప్రాక్టిస్ అక్కడితో ఆపేశారు.చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు.
డ్యాన్స్ వెయ్యాలన్న పట్టుదల మా ట్రూపులో బలంగా నాటుకుంది.మా ట్రూపులో నేను తప్ప ఎవరూ స్టేజి మీద ఎవరూ ట్రై చేయళేదు.’ఏ పాటకి వేయ్యాలి?’ అని బాగా అలోచించి చివరికి రొహిత్ నటించిన “గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని ‘తళుకు తళుకు తారకా…’ పాటకి ఫిక్స్ అయ్యాం.ప్రాక్తిస్ మళ్ళి మొదలయింది.వివేక్ ని చెన్నై కి రమ్మన్నాను.
                                          *                                     *                                   *
కొన్ని సినిమాలోని స్టెప్పులు,కొన్ని మా సొంత స్టెప్పులతో ప్రాక్టిస్ బాగానే సాగుతోంది.వివేక్ వచ్చాడు.రెండ్రోజులు చెన్నై లోని ప్రదేశాలు చూపించాను.మరో రెండ్రొజులు తనే చెన్నై చుట్టి వచ్చేశాడు.ఇద్దరి మధ్యా స్నేహం చిగురించింది.డ్రాయింగ్ కాంపిటిషన్ బాగానే పూర్తయ్యింది.ఎప్పుడెప్పుడాని ఊరిస్తూ వచ్చిన కాలేజ్ డే వచ్చేసింది.ఇంక రెండు రోజుల్లో కలేజ్ డే.
రోజులానే ఉదయం క్లాసులకి వెళ్ళి,మధ్యాహ్నం డ్యాన్స్ ప్రాక్టిస్స్ చూసుకొని కాస్త ఆలస్యంగా రూం కి చేరాను.లోపలి వైపు నుంచి తలుపులు వేసి ఉన్నాయి.
“వివేక్…వివేక్…!!!”…తలుపు కొట్టాను.లోపలి నుంచి ఎలాంటి సమాధనం లేదు.
“వివేక్…వివేక్…!!!”…కాస్త గట్టిగా అరిచాను.లోపలి నుంచి సన్నటి మూలుగువినిపించింది.
అంతే,నాలో కంగారు పెరిగింది.గట్టింగా తలుపుల్ని బాదాను.మధ్యలొ మాత్రమే గడిపెట్టి ఉండడం వలన నాలుగు సార్లు బాదగానే తెరుచున్నాయి తలుపులు.లోపలికి వెళ్ళి చూస్తే….అచేతనంగా పడి ఉన్నాడు…వివేక్.
ఉదయాన్నే కాస్త నీరసంగా ఉంది అన్నాడు.నాలుగు రోజులు బాగా తిరిగినందుకేమో అని ఇద్దరం పెద్దగా పట్టించుకొలెదు.ఇప్పుడు వచ్చి చుస్తే ఇలా…
కాళ్ళూ,చేతులు పని చేయట్లేదు.నోరు మాత్రమే పని చేస్తొంది.ఏమైన తొందర పడ్డావా అంటే అలాంటిదేమిలేదన్నాడు.మరిలా ఎందుకయ్యింది?
సమయానికి ఓనరు కూడా లేడు.ఓనరు భార్యతో ఏమైనా చెప్పినా నా తమిళం ఆమెకర్థం కాదు.ఆటో కోసం బయటకు వచ్చి వెతుకుతూండగా కనిపించారు మా సీనియర్లు.వారిలో మమల్ని డ్యాన్స్ వెయ్యొద్దన్న అతను కూడా ఉన్నాడు. వెంటనే వారి వద్దకు వెళ్ళి భొరున ఏడ్చేసాను.వాళ్ళు సహాయం చేయడంతో వివేక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.అప్పటికి ఒకటి,అరా సినిమాల్లో నటించి జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్న వివేక్ ఫ్రెండ్ చెన్నై లోనే ఉన్నాడని తెలియడం తో అతనికి హాస్పిటల్ నుంచి ఫోన్ చేసాను(అప్పటికి నా దగ్గర సెల్ ఫోన్ లేదు).జరిగింది తెలుసుకున్న మా ఓనరు వెంటనే హాస్పిటల్ కి వచ్చి పరామర్శించారు.ఏదైన సహాయం కావాలంటే అడగమని ధైర్యం చెప్పి వెళ్ళిఫోయారు.మా ఇంటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు.ఆ సమయానికి మా నాన్న ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు.కష్టపడి అర్థం చేసుకున్న మా అమ్మకి,చెల్లాయికి ఓ విషయం మత్రమే అర్థమయింది. “ప్రకాష్,ఫ్రెండ్….హాస్పిటల్!!!”….
                                          *                                     *                                   *
రాత్రి పది గంటలు దాటింది.వివేక్ ఫ్రెండ్ వచ్చాడు.హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ పాయిజన్ కింద వివేక్ పేరు నమోదు చేశారు.దాంతో హాస్పిటల్ వారితో వాదనకు దిగాం.ఇంతలో నన్నెవరో పిలిచారు.
“ప్రకాష్…?!!…మీరేనా!!మీకు రెండు సార్లు ఫోన్ వచ్చింది”.
‘…!!?!’ ఎవరబ్బా అనుకొని మట్లాడాను.
‘నాని(మా నాన్న నన్నలానే పిలుస్తారు)!నేన్రా…ఏమైంది.మీ ఓనరు ఫొన్ చేశారు…’అంటూ జరిగిన విషయం చెప్పారు.మా ఓనరు వాళ్ళు చెప్పింది సరిగ అర్థం చేసుకోలేని మావాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు.ఇంటికొచ్చిన మా నాన్న మా ఓనరుతో మట్లాడి హాస్పిటల్లో ఉన్నది నేను కాదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.మా నాన్నకు జరిగిన విషయం చెప్పాను.దాంతో వాళ్ళు కుదుటపడ్డారు.
డాక్టర్లు ఏవేవో ఇంజెక్షన్లు ఇస్తున్నారు.సెలైన్ బాటిల్ ఎక్కించారు.వివేక్ వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకున్నాం కాని మరి ఇంత రాత్రి వేళ చెప్పడం ఎందుకులే అని ఆగాం.నేను ,వివేక్ ఫ్రండ్ ఇద్దరం రాత్రంతా హాస్పిటల్లోనే గడిపాము.తెల్లారింది.మ దగ్గరున్న డబ్బులు అయిపోవచ్చాయి.వివేక్ పరిస్థితి లో ఎలాంటి మార్పూలేదు.వివేక్ వాళ్ళింట్లో చెప్పాలనుకొని నెంబర్ అడిగాం.ఊరి కాని ఊరు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారనీ,తననే తిరుపతికి తీసుకెళ్ళమని చెప్పాడు.
దాక్టర్లు ఇంజెక్షన్లు వేశాక తీసుకెళ్ళొచ్చని చెప్పారు.కాని ఎలా తీసుకెళ్ళాలి??అంబులెన్స్ కి అయ్యే ఖర్చు కూడా మా దగ్గర లేకపోవడంతో ఒక ఆటో ని మట్లాడుకున్నాం.నాలో కంగారు పోయి ధైర్యం వచ్చింది.విషయం తెలిసిన బోసు,బాలక్రిష్ణ తోడుగా వస్తామని అన్నా వారించి వద్దని చెప్పేశాను.ఇంక వివేక్ ఫ్రెండ్ అవసరం లేక పోవడంతో అతన్ని వెళ్ళమని చెప్పి తిరుపతి కి ఆటోలో బయలుదేరాం…నేను…వివేక్…ఇద్దరు ఆటోడ్రయివర్లు.
                                          *                                     *                                   *
ఆటో డ్రయివర్లు తమ నైపుణ్యానికి పనిచెప్పి అడ్డదారులలో బస్సుకన్నా వేగంగా మమల్ని వివేక్ ఇంటికి చేర్చారు.వివేక్ తలితండ్రులతో మట్లాడాక నా మనసు కొంచం కుదుట పడింది.వివేక్కి పుట్టినప్పటి నుంచే పొటాషియం డెఫీషియన్సి(శరీరంలో పొటాషియం శాతం తక్కువ) ఉందంట.అప్పుడప్పుడూ స్ప్రుహతప్పడం తప్ప ఇలా ఎప్పుడూ జరగలేదంట.వాళ్ళే ప్రమాదం లేదని చెప్పడం,నా అవసరం ఇంకలేదని తెలిశాక తిరిగి అదే ఆటోలో చెన్నైకి బయలుదేరాను.రాత్రి సరిగా నిద్ర లేకపోవడంతో ఆటోలో బాగా నిద్రపొయాను.
చెన్నై చేరేసరికే సాయంత్రం అయింది.రూం కెళ్ళగానే బాగా వేడినీటిలో స్నానం చేసి రాత్రి హాస్టల్ కి వెళ్ళాను.రేపే కాలేజ్ డే.స్టేజి అప్పుడే కట్టేశారు.ఎవరికీ తెలియకుండా తక్కువ సౌండ్ పెట్టుకొని స్టేజి పైన వేసి చూసుకున్నాం.బాగానే వచ్చింది.అయిపోయాక వచ్చి బాగా రిలాక్స్ అయ్యాను.
                                          *                                     *                                   *
కాలేజ్ డే.
ప్రేక్షకుల చప్పట్లు,ఈలలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.డ్రాయింగ్ లో ద్వితీయ బహుమతి వచ్చింది.
గ్రూప్ డ్యాన్స్ లొ మాదే టాప్.స్టేజి దిగంగానే లెక్చరర్లు,చైర్మన్ స్పెషల్ గా అభినందించారు.నా టీం మేట్స్ పండగ చేస్కున్నారు.
సంతోషంగానే ఉన్నా నాకు మాత్రం ఏదో ఫీలింగ్…..వివేక్ గురించి.తర్వాతి రోజులు శని,ఆదివారమే కావడంతో వెంటనే తిరుపతి బయలుదేరాను.
నేను,ముని కల్సి వివేక్ ని కలిశాము.ఆశ్చర్యం!!!తను ముందులానే మామూలుగా తిరుగుతున్నాడు.మొహం లో మాత్రం కొద్దిపాటి నీరసం కనిపిస్తోందంతే.వివేక్ ని దింపి మెము చెన్నై బయలుదేరాక తనని గవర్నమెంటు ఆస్పత్రిలో చేర్చారంట.అక్కడ 150 రూపాయల పొటాషియం ఇంజెక్షన్ ఒకటి ఇవ్వగానే గంటలో లేచి కూర్చున్నాడంట.బాగా నీరసం వచ్చినప్పుడు 70 రూపాయల పొటాషియం మందు బాటిల్ కొని ఒక వారం రోజులు త్రాగమన్నారంట డాక్టర్లు.
అనవసరంగా మా పర్సుల్ని ఖాళీ చేయించిన ప్రైవేట్ హాస్పిటల్ ని బాగా తిట్టుకొని,వివేక్కి ఏమికానందుకు చాలా సంతోషించాను. నేనిలా ఆటోలోతిరుపతి వచ్చిన విషయం మా ఇంట్లో తెలియనివ్వలేదు.అలా చెబితే కంగారు పడాతారని వివేక్ కి కొంచం నయమయ్యాక తనే తిరుపతి వెళ్ళిపోయాడని చెప్పాను.కాలేజ్ డే కన్నా ఇదే అసలైన ఆనందం అనిపించింది నాకు.
                                          *                                     *                                   *
వివేక్ ని ఆటోలో తిరుపతి కి తీసుకెళ్ళిన విషయం కాలేజిలో తెలిసింది.అందరూ మమల్నిఆకాశానికెత్తేశారు.క్లాసులోకి వెళ్తే చాలు,ఒకటే ఈలలు,గోలలు.ఫష్టు క్లాసులో పాసవడం,డ్రాయింగ్ లో సెకండ్ ప్రైజ్,డ్యాన్స్ లొ కాలేజ్ టాప్ రావడంతో నన్నందరూ హీరోని చేసేశారు.ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా ఆనందించాను.
వావ్….నేనా…!!!…హీరోన….?!!
లక్ష బెలూన్లు ఒక్కసారిగా ఆకాశంలోకెగిరిన ఆనందం.

                                          *                                     *                                   *
షరామామూలుగా పరీక్షలు సమీపిస్తున్నాయి.ముందుగ లాబ్ పరీక్షలు జరుగుతున్నాయి.నేను అప్పటికే ఒక లాబ్ పరీక్ష రాసి బయటకు వస్తున్నాను.ఇంతలో మా చైర్మన్ గారి భార్య పిలిచారు.
‘యెస్ మేడం!’…అన్నాను వినయంగా.
‘లాబ్ ఎగ్జాం ఎంతసేపు చేశావ్?’…
కొంచం కంగారుగా…’ఒక గంటసేపు…ఏమైంది మేడం!?!!’…
‘ఏమిలేదు…అరగంటలో చేసుంటే 100 మార్కులు,గంటలో చేసుంటే 90 పైన మార్కులు వేయిద్దామని…’అన్నారు.
యాహూ…….ఎగిరి గంతేసి అనవసరంగా గంట అని చెప్పానేమోనని నన్ను నేనే తిట్టుకున్నాను.
ఆ సెమిస్టరు లాబ్ పరీక్షలన్నిటిలోనూ 90,95 పైన మార్కులు వేయించారు.
మళ్ళీ లక్ష బెలూన్లు ఒక్కసారిగా ఆకాశంలోకెగిరిన ఆనందం.
నన్ను నేనే నమ్మలేకపోతున్నాను.ఎప్పుడూ 60-70శతం మార్కులు వచ్చే నాకు గరిష్టంగా 97మార్కులు వచ్చాయంటే ఎలా ఉంటుంది?!!..
చాలా సంతోషంగా మిగతా పరీక్షలు పూర్తిచేశాను.నా ఆనందానికి అవధుల్లేవ్….నేను…హీరోని…యాహూ…
కొన్ని రోజుల తర్వాత పరీక్షల ఫలితాలు వచ్చాయి.ఈసారి అరవైలో ఇరవై మంది పాసయ్యారంట.కంప్యూటర్ లాబ్ కెళ్ళి రెజల్ట్స్ చూసుకున్నాను.
మూడు లాబ్స్ లో వరుసగా 93,93,97.ఇంక సబ్జెక్ట్టుల్లో
67,14,28,58,24,21….
ఆ!..ఏంటిది!?!!!……  నాలుగు సబ్జెక్టులు......... ఫెయిలా…..
       ……!!.....???.........@@......@..........!&........!!…….
బాబోయ్….
ఆకాశంలో బెలూన్లు పగిలిపోతున్నాయి…
ఎక్కడో టైర్లు పంచర్లవుతున్నాయి…
కాళ్ళ క్రింద భూమి రెండుగా చీలిపోతోంది…ఇప్పుడేది దారి…

ఏడుకొండలవాడా వేంకటరమణా….

మహాయుగం



March 26, 2010 న తెలుగురత్నలో ప్రచురితం.
http://teluguratna.com/blog/2010/03/26/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%97%e0%b0%82/


బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని మందగించిన వేళ…
శివుడు ప్రళయ కాలభధ్రుడై విలయ తాండవం చేస్తున్న వేళ…
భూప్రపంచం మొత్తం దద్దరిల్లి పోతోంది… దిక్కులన్నీ పెక్కటిల్లేలా ఆర్తనాదాలతో నిండిపోతోంది!!!
ఒక వైపు మేఘాలు ఆగ్రహంతో అగ్ని కీలలనను ఉరుముతుంటే…. మరో వైపు అవే మేఘాలు జరిగిన దానికి వెకిలి కన్నీళ్ళు కారుస్తునట్లు హోరుగా వర్షిస్తునాయి…..
ఒక దిక్కున అకారణ భూకంపాలతో భారి కట్టడాలు సైతం కుప్పకూలిపోతుంటే…. మరో దిక్కున ఉవ్వెత్తున పోటెత్తే  అలలు ‘ఇది కూడ ఒక ఎత్తేనా’ అని అడ్డుపడే ఎత్తులను పరిహసిస్తూ అవలీలగా తమలో కలిపేసుకుంటున్నాయి.
అగ్ని పర్వతాలు బ్రద్దలౌతున్నాయి.ఉవ్వెత్తున ఎగిసి పడే అగ్ని జ్వాలలు ఇన్నాళ్ళూ తన మేధస్సుతో అంచెలుగా ఎదిగి, ప్రకృతిని శాసించగలిగి ‘ప్రపంచాన్ని సైతం జయించగలనూ’ అని ప్రకటించుంకున్న మూర్ఖ మానవుని ప్రయోగాల కోటల్ని ఛిద్రం చేస్తూ క్షణంలో భూస్థాపితం చేస్తునాయి.

మనిషి మనుగడ నేర్చింది ప్రకృతి నుంచే,దాన్ని విస్మరిస్తే ప్రకృతిలోనే కలసిపొవాలసిందె అని గుర్తుచెస్తూ ప్రతి ఒక్కరూ శిక్షింపబడుతునట్లు ప్రాణ భయంతో పరుగులెత్తిస్తునాయి.
ప్రాంతాలకతీతంగా సకల ప్రాణులూ భగవంతుని ప్రార్థించే వేళ….
తమను రక్షించే ఏదో శక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ…..
*                                                 *                                                 *
ఉన్నట్టుండి ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది.ఆ వెలుగు రెప్పపాటులో అంతకంత రెట్టింపవుతూ కళ్ళు మిరుమిట్లుగొలిపే కాంతి ఆవరించుకుంది.ఇప్పటి వరకు కటిక చీకటిని చూసి వుండచ్చుగాక, కటిక వెలుగులా(??…) ఇంత కాంతి ఉన్నా గుర్తించలేని విధంగా ప్రకాశించింది.సాటి ప్రాణి మీద ప్రేమ,దయలేని…అసలు పక్క వాడి ఎదుగుదలే చూడలేని అల్ప మానవుడి కళ్ళు ఇంతటి వెలుగును దర్శించడానికి అనర్హమంటూ వారి కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి.భూమి దారి తప్పి సూర్యుని కక్ష వైపు వెళ్తోందా లేక ఏదైనా వచ్చి ఢీకొనబోతోందా అని అశేష ప్రజానీకం(?) భయపడుతూండగా…..
ఆకాశంలో మెల్లగా ప్రత్యక్షమౌతోంది… ఓ రూపం!!!!
అప్పటి వరకు కళ్ళు తెరిచి చూడలేనంతగా ఆవరించిన కాంతి క్రమంగా సాధారణ స్థాయికి వస్తోంది.వెలుగుని చూడలేక కళ్ళు పోగా మిగిలిన ప్రాణికోటి మొత్తం నెమ్మదిగా కనులు తెరిచి అటు వైపే చూడసాగాయి.
మొదటగా…. కనులు….. ఆ తర్వాత…..పెదవులు!!!
అద్భుతం…మహాద్భుతం!!నమ్మశఖ్యం కాని నిజం!!!
జీవ జాతి మనుగడ కాపాడడం కోసం కలియుగాంతమున ‘కల్కీ గా అవతరించ శ్రీ మన్మహా విష్నువా!!!
పాపములను హరించి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు పంపగా వచ్చిన ఏసు ప్రభువ… లేక అల్లాన… అనుకుంటూ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించారు.కనిపిస్తునవి కళ్ళు పెదవులే అయినా ఏమని వర్నించగలం ఆ రుపాన్ని!!!
హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడిన ఉగ్ర నరసింహుని వలే పాపులను శిక్షించడానికి వచ్చిన భగవంతుని లాగా లేవవి.అమృతాన్ని అసురులకు దక్కనివ్వకుండా చాకచక్యంతో దేవతలకు మాత్రమే పంచిన మోహినీమూర్తి కళ్ళు వలే మనోహరంగా ఉన్నాయి.ఎన్ని కష్టాలు అనుభవించినా,ఒక్క బాణంతో లంకను శాసించినా చెరగని చిరునవ్వుగల  శ్రీరామచంద్రుని వలే నిర్మలంగా ఉన్నాయా పెదవులు.
ఆహా…ఎన్నో జన్మల పుణ్య ఫలం.ఎవరికీ దక్కని అరుదైన అవకాశం.ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలి.ఇంక ప్రాణాలు పోయినా పర్వాలేదు!!!
అలా క్షణ కాలం పాటు ముగ్దుల్ని చేసి ఆనందానుభూతులను కలిగించిన ఆ సుమనోహర రూపం క్రమంగా అదృశ్యమై ఓ చిన్న వలయాకారాన్ని సంతరించుకుంది.నూరు తప్పుల అనంతరం శిశుపాలుని పై సంధించిన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం వలే వేగంగా తిరుగుతూ భూమి వైపు దూసుకొచ్చింది.ఊహించని విధంగా పెద్దదవుతూ నిర్దేశింపబడినట్లుగ కొంతమంది మానవులను, జంతువులను, వృక్ష సంపదను తనలో ఐక్యం చేసుకుంటోంది.
కొంతమంది ప్రజానీకం దాన్ని చూసి ఏదో మాయని భయపడి పారిపోతూంటే,కొంతమంది అన్ని ఆశలూ వదిలేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అక్కడక్కడా మిగిలిన కొంతమంది భారతీయులకు మాత్రం ఓ విషయం స్పష్టంగా అవగతమౌతోంది…
సత్య యుగంలో జలప్రళయం సంభవించినపుదు మత్స్యావతారంలో వచ్చి మరో యుగమునకు అవసరమైన భూసంపదను ఒక ఓడలో చేర్చి,ప్రళయం తగ్గు వరకు ఆ ఓడను హిమవంత పర్వతం దగ్గర భద్రపరచినట్లు..!
పాల సముద్రాన్ని చిలికేటప్పుడు కూర్మావతారంలో వచ్చి మందర పర్వతాన్ని ఒరిగిపోకుండా కాపాడి అడుగంటిపోతున్న దేవతల ఆశల్ని నిలబెట్టినట్లు…!!
వేదాలను పవిత్ర గ్రంధాలను దొంగిలించి,భూప్రపంచాన్ని సముద్రగర్భంలోని పాతాళానికి తోసేస్తున్న హిరణ్యాక్షుడిని వరాహావతారంలో అంతమొందించి గ్రంధాలను,ప్రపంచాన్ని కాపాడినట్లు…అవును!అదే!!!
కల్కీగా మళ్ళీ అవతరించి తమను కాపాడడానికే ఆ మాయా వలయాన్ని సృష్టించాడు.బుడతడిగా వచ్చి సర్వలోకములను ఆక్రమించిన వామనుని పాదం వలే ఇంతై…ఇంతింతై అన్నట్లు ఆ వలయం రెట్టింపవుతోంది.పిల్లలు,పుణ్యాత్ములైన ముదుసలివాళ్ళు సైతం అందులోకి లీలగా వెళ్ళిపోతూండగా,అందులోకి ప్రవేశించుటకు ప్రయత్నించిన పాపులకది క్షత్రియులను చెండాడిన పరశురాముని గండ్రగొడ్డలిలాగా హెచ్చరిస్తోంది.తెగించి ముందుకి వెళ్ళిన వారు వెళ్ళినట్లుగానే చనిపోతున్నారు.
*                                                 *                                                 *
దుష్టులు శిక్షించబడ్డారు.మిగిలిన వారు వలయంలోకి వెళ్ళిపొయారు.వలయం సుడిగాలి వలే తిరుగుతూ వారిని సురక్షిత
ప్రదేశంలో వదిలేసింది. కార్యం పూర్తైయింది. యుగం ముగిసింది.
రాబోతున్నది అనందానుభూతులు పంచే స్వచ్ఛమైన సమాజం.
అవతరించబోతున్నది మరో యుగం…..మహాయుగం!!!!